అజారుద్దీన్ మంత్రి పదవికి ఉన్న గండం తప్పింది. ఈ నెలాఖరు లోపు ఎమ్మెల్సీ పదవి రాకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి పోతుందనే ఊహాగానాల మధ్య.. గవర్నర్ ఆయనను ఎమ్మెల్సీగా నియమించడంతో ఉత్కంఠ వీడింది. దీంతో తాజాగా ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణం చేసి.. తన మంత్రి పదవిని నిలబెట్టుకున్నారు. ఇక అజారుద్దీన్‌తోపాటు కోదండరాం కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.

మండలిలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితోపాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. గవర్నర్‌ కోటాలో మహమ్మద్‌ అజారుద్దీన్‌, కోదండరాంలను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేయగా.. గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా ఆదేశాలతో సాధారణ పరిపాలన శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఎమ్మెల్సీగా తన పేరును ప్రతిపాదించినందుకు కాంగ్రెస్‌ పార్టీ హైకమాండ్‌కు, రాష్ట్ర మంత్రి మండలికి, పీసీసీకి అజారుద్దీన్ థ్యాంక్స్ చెప్పారు. రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని గుర్తు చేశారు. మైనార్టీల సంక్షేమం కోసం తాను మరింత కృషి చేస్తానని చెప్పారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ముస్లింల ఓట్ల కోసమే తనకు మంత్రి పదవి ఇచ్చారని అనడంలో ఎలాంటి నిజం లేదని.. ముందు నుంచీ సీఎం రేవంత్‌ రెడ్డి మైనార్టీలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిలకు అజారుద్దీన్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. ఇక తనకు క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువ అని.. అందుకే పొలిటికల్ ఫ్యాన్స్‌ని పెంచుకుంటానని తెలిపారు.